పెనుగొండ: హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సీఆర్‌జెడ్ పరిధిలోని నడిపూడి, రావిలంకల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం దారుణమని వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిపూడిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఆశ చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరూ ఆశపడే రకం కాదన్నారు. గోదావరిని స్థానిక ప్రజా ప్రతినిధులు గుత్తగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ స్థానిక నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారులు అక్రమాలకు అండగా ఉంటున్నారన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై పోరాటం చేస్తే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని పోరాటం చేస్తామని హెచ్చరించారు.


