దగ్గర కావడంతో ఇబ్బంది లేదు
విద్యాబోధన బాగుంది
భీమవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు సైతం ఉన్నత విద్యనభ్యసించడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పాటుచేసిన హైస్కూళ్లలో ఇంటర్ విద్యకు ఆదరణ పెరుగుతోంది. గతంలో టెన్త్ అనంతరం బాలికలను దూరప్రాంతాలకు ఉన్నత విద్య అభ్యసించడానికి పంపించడానికి తల్లిదండ్రులు అనేక మంది అంగీకరించేవారు కాదు. దీనితో అనేక మంది బాలికలు టెన్త్‌తోనే చదువుకు స్వస్తి చెప్పేవారు. ఉన్నత విద్య అభ్యసించాలనే కాంక్ష ఉన్నా అవకాశం లేని బాలికల కోసం ప్రతి మండలంలోను హైస్కూల్‌లోనే ఒక చోట జూనియర్ కళాశాల మాదిరిగా హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్ విద్యనందించే ఏర్పాటుచేశారు. ఈ విధంగా 2022–23 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 20 మండలాలకుగాను భీమవరం, పెంటపాడు, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకోడేరు, పెనుగొండ, అత్తిలి తదితర మండలాల్లో 16 హైస్కూళ్లను ఇంటర్ విద్యనందిండం ప్రారంభించారు.
ఉచిత విద్యతోపాటు భోజన సదుపాయం
హైస్కూల్ ఫ్లస్ విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించడమేగాక విద్యార్థులు యూనిఫాంతోపాటు ఉచిత భోజన సదుపాయం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు ఉన్నత విద్యపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని కళాశాలల వద్ద విద్యార్థులకు దాతల సహకారంతో విద్యాసామాగ్రి నందించడం, ఇతర సదుపాయాల కల్పన వంటి వాటికి అక్కడి అధ్యాపకులు ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఏర్పడింది.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
హైస్కూల్ ప్లస్ విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులను అందిస్తుండగా ప్రారంభించి 2022–23 ఏడాది 16 కళాశాలల్లో కేవలం 97 మంది విద్యార్థులు మాత్రమే చేరగా వారిలో 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023–24లో విద్యార్థులు సంఖ్య 232కు చేరగా వారిలో 121 మంది ఉత్తీర్ణులయ్యారు. 2024లో ప్రభుత్వం మారడంతో హైస్కూల్ ప్లస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో విద్యార్థుల సంఖ్య 126కు పడిపోయింది. వారిలో 86 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ప్రభుత్వం హైస్కూల్ ప్లస్ కొనసాగించడంతో 2025–26 విద్యాసంవత్సరంలో 344 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 195 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని హైస్కూల్ ఫ్లస్ విద్యపట్ల మరింత శ్రద్ధ వహించే పూర్తిస్థాయిలో ల్యాబ్‌లు వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.
ఫలిస్తున్న గత ప్రభుత్వ చర్యలు
మాజీ సీఎం జగన్ హయాంలో హైస్కూళ్ల అప్‌గ్రేడ్
జిల్లాలో 16 బాలికల కళాశాలల ఏర్పాటు
2022–23లో 97 మందితో ప్రారంభం
ఈ ఏడాది 344కి పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఉన్నత విద్యకు అవకాశం ఏర్పడిందంటున్న విద్యార్థులు
నేను ఇంటర్ చదవాలంటే భీమవరం, పాలకొల్లు, వీరవాసరం వంటి ప్రాంతాలకు వెళ్లాలి. అయితే ఆర్టీసీ బస్ సదుపాయం అంతగా లేకపోవడంతో దగ్గరలో ఉన్న మా గ్రామంలోని హైస్కూల్లోనే ఇంటర్‌లో చేరాను. బైపీసీలో 1000 మార్కులకు 963 మార్కులు సాధించాను. నీట్ పరీక్షకు సిద్ధం అవుతున్నాను.
– కె సంతోషి, రాయకుదురు
నేను రాయకుదురు గ్రామంలోని హైస్కూల్లోనే ఎంపీసీ గ్రూప్‌లో చేరాను. విద్యాభోదన బాగుండడంతో 1000 మార్కులకు గాను 972 మార్కులు సాధించాను. మా అన్న సురేష్ సహకారంతో ప్రస్తుతం ఎంసెట్‌కు ఇంటి వద్దనుంచే శిక్షణ పొందుతున్నాను.
– శీలం జోత్స్న, రాయకుదురు


