కొల్లేరు.. ఎడారి తీరు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు.. ఎడారి తీరు

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

సముద్రపు నీరు కొల్లేరులోకి..

గోదావరి జలాలు మళ్లించాలి

రెగ్యులేటర్లు నిర్మించండి

మాయమవుతున్న పచ్చదనం

సముద్రపు ఉప్పునీరు కొల్లేరులోకి..

రెగ్యులేటర్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం

కై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. ఏప్రిల్‌లోనే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. కొల్లేరు పక్షులు నీటికోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి.

అలమటిస్తున్న కొల్లేరు పక్షులు

కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కాలం. కొల్లేరులో వింటర్‌ సీజన్‌ ముగిసినప్పటీకీ కొన్ని విదేశీ పక్షులతో పాటు స్వదేశీ పక్షులు కొల్లేరులోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం విహార చెరువులో కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత ఎండలు బట్టి మరో 20 రోజుల్లో నీరు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో పక్షులకు వేసవి ఆహార కష్టాలు ఈ ఏడాది తప్పడం లేదు.

రెగ్యులేటర్ల నిర్మాణం కలేనా..?

కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే శరణ్యమని పలు కమిటీలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్‌పై డబుల్‌ లైన్‌ బ్రిడ్జి. గరిసిపూడి అండర్‌ టెన్నల్‌ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే కై కలూరు, ఆకివీడు, భీమవరం, పెడన, దెందులూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులేటర్ల అంశాన్ని పక్కన పడేసింది.

కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంట పొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కై కలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడబారాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఉప్పుశాతం ఎక్కువై కొల్లేరులో మట్టి బీటలు వేస్తోంది. మావులు (చేపలను పట్టే బుట్ట)ను కొల్లేరు సరస్సులో పెడుతోన్నా మత్స్యకారులకు రిక్తహస్తాలే మిగులుతున్నాయి.

కొల్లేరుకు గోదావరి జలాలు మళ్లించాలి. చింతలపూడి వద్ద ఈ అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కొల్లేరుకు నీరు వస్తుంది. అసలు కొల్లేరు సమస్యకు గుదిబండగా మారిన 120 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. కొల్లేరు ప్రజలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి.

– చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత సాహితీవేత్త, కై కలూరు

రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సముద్రపు నీరు ఏటా కొల్లేరులో ప్రవేశించకుండా షెట్టర్లు మూసుకునే అవకాశం కలుగుతుంది. నిల్వ చేసిన నీటిలో 2 అంగుళాల చేప పిల్లలను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. దీంతో కొల్లేరులో వలసలు నివారించవచ్చు. వైఎస్సార్‌సీపీలో కేటాయించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దు. – ముంగర నరసింహారావు, కొల్లేరు నాయకుడు, ఆకివీడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement