ఏలూరు (టూటౌన్): వివిధ మండలాల్లో పురుగు, తెగుళ్ల కారణంగా చనిపోతున్న వేప చెట్లను సోమవారం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీకే లక్ష్మీ, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్‌బీవీ చలపతిరావు, ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. కె. ఫణికుమార్ సంయుక్తంగా పరిశీలించారు. డైబ్యాక్ కారణంగా వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించారు. డైబ్యాక్ అన్ని వయసుల వేప చెట్ల ఆకులు, కొమ్ములు, పుష్పాలను ప్రభావితం చేస్తుందన్నారు. దీని ప్రభావంతో చెట్టు పైభాగం నుంచి కిందివరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయన్నారు. దీంతో చెట్లలో పూర్తిగా పండ్ల ఉత్పత్తి నష్టం సంభవిస్తుందన్నారు. డైబ్యాక్ ఒక ఫంగల్ రోగం అయినప్పటికీ, వేప చెట్లు కొన్నిసార్లు టీ మస్కిటో బగ్ కీటకం ద్వారా కూడా ప్రభావితమవుతాయన్నారు. డైబ్యాక్ సోకిన కొమ్ములను కత్తిరించి తొలగించాలని, తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బెండెజిం 1 గ్రా, ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు చిగురు, కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలని సూచించారు.


