డివైడర్‌ ఎక్కిన కారు | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ ఎక్కిన కారు

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

డివైడర్‌ ఎక్కిన కారు ఎస్సై కొట్టాడని పురుగుల మందు తాగిన యువకుడు రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

తణుకు అర్బన్‌: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డివైడర్‌పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది.

చికిత్స పొందుతూ మృతి

మంగళగిరి టౌన్‌, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్‌, పోలీస్‌ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్‌కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్‌ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్‌ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్‌ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పోడూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్‌కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్‌ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. గాయాలపాలైన రమణను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement