నరసాపురం: పట్టణంలోని 10వ వార్డులో బ్యాంకు ఉద్యోగికి చెందిన ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన జి.శ్రీనివాస్ జాతీయబ్యాంకులో పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా షిరిడీ వెళ్లారు. సోమవారం యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువాలో దాచిన 18 కాసుల బంగారు నగలు, 2.50 కిలోల వెండి వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు దోచుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జయలక్ష్మి సిబ్బందితో వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వివరించారు.


