26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

30న రాత్రి 8 గంటల నుంచి తిరుకల్యాణం

వచ్చేనెల 1న రథోత్సవం

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని ఈఓ కోరారు.

ఉత్సవాలు జరిగేదిలా..

● ఈనెల 26 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 27న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 28న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 29న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 30న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● వచ్చేనెల 1న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 2న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

● 3న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement