ప్రియుడి ఇంటి ముందు నిరసన
ఉండి: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి అనంతరం ముఖం చాటేయడంతో యువతి కుటుంబంతో కలిసి ప్రియుడి ఇంటిముందు న్యాయం చేయాలంటూ సోమవారం నిరసన తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని రామచంద్రాపురం ప్రాంతాని చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన కరణం భానుప్రకాష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలల క్రితం యువతికి చేబ్రోలు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమై కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే తాను వివాహం చేసుకుంటానని చెప్పి యువకుడు ఆ పెళ్ళి చెడగొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు పెద్దల సమక్షంలో యువతీ, యువకుడికి దండలు మార్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. యువకుడికి అన్నయ్య ఉండటంతో అతనికి వివాహమైన అనంతరం చిన్నవాడైనన భానుప్రకాష్‌కు వివాహం చేస్తానని యువకుడి తండ్రి చెప్పడంతో పెద్దలు ఆరునెలల గడువిచ్చారు. ఈ ఆరు నెలల్లో పెద్దకుమారుడికి వివాహం చేయకపోగా అతనిని గల్ఫ్ దేశం పంపించేసారు. పరిస్థితిని గమనించిన యువతి గత కొంతకాలంగా యువకుడిని నిలదీస్తుంది. యువకుడు ముఖం చాటేయడంతో చేయిదాటిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం యువకుడి ఇంటికి వెళ్ళి మాట్లాడటంతో వారంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ప్రియుడి ఇంటిముందే యువతి కుటుంబంతో సహా నిరసనకు దిగింది. పెద్దల సమక్షంలో దండలు మార్చి వివాహం ఖాయం చేసారని తనకు న్యాయం చేయాలంటూ యువతి కన్నీటి పర్యంతమైంది.


