గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి అన్నారు. తొలిసారి బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేఆర్‌పురం ఐటీడీఏను సందర్శించి పథకాలపై ఆరా తీశారు. అదేవిధంగా మండలంలోని రాజానగరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాల వివరాలను, మెనూ అమలుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేఆర్‌పురం సచివాలయంను సందర్శించారు. అలాగే ఐటీడిఏ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అలాగే వసతిగృహాల్లో ఏఎన్‌ఎంల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల్లో పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేఆర్‌పురం ఐటీడిఏ డీడీ పి.జగన్నాథరావు, డీవైఈఓ కె.రవిప్రసన్న కుమార్, సీఎంఓ సున్నం శ్రీనివాస్, ఏటీడబ్ల్యూఓ జి.జనార్థన్ పాల్గొన్నారు. ఎస్టీ కమిషనర్ చైర్మన్ రాత్రి ఐటీడీఏలోని గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. గురువారం కూడా బుట్టాయగూడెం మండలంలోని గురుకుల పాఠశాల, తెల్లంవారిగూడెం, దొరమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారని అధికారులు తెలిపారు.
మౌలిక వసతులు సక్రమంగా అందాలి
పోలవరం రూరల్: గిరిజన విద్యార్థులకు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా అందాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. బుధవారం పోలవరం మండలంలోని ఇటికలకోట, బోడిగూడెం, చేగొండిపల్లి గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఆయన్ను ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.


