మాస్టర్ ప్లాన్‌లో మర్మాలెన్నో
రాజకీయ దురుద్దేశంతోనే మాస్టర్ ప్లాన్
తణుకు అర్బన్: తణుకు నియోజకవర్గంలో భవిష్యత్తు అవసరాల పేరిట రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ ఆమోదయోగ్యం కాని మాస్టర్ ప్లాన్ రూపొందించారంటున్నారు. 2000 సంవత్సరంలో 20 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించగా.. దానిని పక్కన పెట్టి 101.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రూపొందించడంపై పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్లాన్‌ను మార్పులు చేస్తూ కొందరికి మేలు చేసే క్రమంలో సన్న, చిన్నకారు రైతులతోపాటు నివాసాలు ఉంటున్న వారికి కూడా ఇబ్బందులు సృష్టించేలా ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు తమ అవసరాల కోసం భూములు అమ్ముకోవాలన్నా అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు, ఇండస్ట్రియల్ జోన్‌పై విమర్శలు
అవుటర్ రింగ్‌రోడ్డు పేరుతో తణుకు నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేయడమే కాకుండా కె.ఇల్లింద్రపర్రు, గోటేరు, కావలిపురం, మండపాక తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహావసర ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ప్రాంతంగా చూపించడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిపై కూడా ప్రభావం పడుతుందనేది ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. తణుకు నియోజకవర్గంలోని కావలిపురం, రేలంగి, వేల్పూరు, గోటేరు, కె.ఇల్లింద్రపర్రు, కొమరవరం, మండపాక, తేతలి, తణుకు మునిసిపాలిటీలోని వేమవరం, సజ్జాపురం, పైడిపర్రు, వెంకటరాయపురం, వీరభద్రపురం ప్రాంత వాసుల్లో మాస్టర్ ప్లాన్ ఆందోళన మొదలైంది.
ప్రజాభిప్రాయానికి ప్రాముఖ్యత ఏది?
తణుకు నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేసేలా రూపొందించిన 2025 మాస్టర్ ప్లాన్‌కు ప్రజాభిప్రాయం తీసుకోలేదనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. తణుకు మునిసిపాలిటీలో కౌన్సిల్ లేకపోవడంతో ప్రజల నుంచి తప్పనిసరిగా అభిప్రాయన్ని తీసుకోవాలన్న నిబంధనను అధికారులు పాటించలేదనేది ప్రధాన ఆరోపణగా నిలుస్తోంది. ప్రతి వార్డులోను ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల అవసరాలు, ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆయా గ్రామాల్లో గ్రామస్తులను కూడా అడగలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తణుకు ముఖద్వారం
భవిష్యత్తు అవసరాలంటూ పేదలు, రైతులకు ఇబ్బందులు
నివాస ప్రాంతాలను ఇండస్ట్రియల్‌గా ఎలా మారుస్తారు
రాజకీయ దురుద్దేశం అంటున్న మాజీ మంత్రి కారుమూరి
రాజకీయ దురుద్దేశంతోనే తణుకులో 2020 మాస్టర్ ప్లాన్‌ను తొక్కేస్తూ నేడు తాజాగా 2025 మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. ప్రజలు, రైతులు ఇబ్బంది పడేలా తమ వారికి మేలు చేసే విధంగా మాస్టర్ మైండ్‌తో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. నివాస ప్రాంతాలను కూడా ఇండస్ట్రియల్ ప్రాంతంగా మార్చడం ఎంతో దుర్మార్గం. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఏమైపోవాలో చెప్పాలి. అవుటర్ రింగ్ రోడ్డుతో సన్న, చిన్నకారు రైతులు తమ భూములకు సంబంధించి క్రయ విక్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుంది. పెద్దలకు అవసరమైన ప్రాంతాలను తప్పించి రైతులు, పేదలు ఇబ్బందులు పడేలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ప్రజలనెత్తిన రుద్దాలని అనుకుంటున్నారు. ప్రజల కోసం పోరాటం చేసి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి
మాస్టర్ ప్లాన్‌లో మర్మాలెన్నో


