వైద్య విద్య ప్రైవేటీకరణ నష్టాలపై సెమినార్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణ – సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై విజయవాడలో జరిగే రాష్ట్ర సెమినార్‌ను విజయవంతం చేయాలని కోరుతూ పీడీఎస్‌ఓ నాయకులు మంగళవారం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, జిల్లా ఆసుపత్రి వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల 17 కొత్త వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం రూ.8,500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించిందని, అందులో ఐదు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి, ప్రజాధనంతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను పీపీపీ పేరిట ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించేందుకు పూనుకుందని, దీని వల్ల ప్రభుత్వ కళాశాలలో కేవలం రూ.5 లక్షలతో పూర్తయ్యే కోర్సుకు రూ. 27.5 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఈ అంశంపై పీడీఎస్‌ఓ రాష్ట్ర సెమినార్‌ను నిర్వస్తుందన్నారు .


