నెలగంట మోగింది
● శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు
● నెలరోజులపాటు తిరుప్పావై సేవలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో మంగళవారం నెలగంట మోగింది. అర్చకులు, పండితులు ధనుర్మాస ఉత్సవాలను మధ్యాహ్నం 1.27 గంటలకు ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను శుభ్రం చేసి, మామిడి తోరణాలు, అరటి బోదెలు, పుష్పమాలికలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపాన్ని రంగులతో సుందరీకరించారు. ఈ పనులు అర్థరాత్రి వరకు సాగాయి. శ్రీవారి పాదుకా మండప ప్రాంతాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. పలువురు మహిళా భక్తులు ఆలయ ప్రధాన రాజగోపురమెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. రంగవల్లులతో మెట్లదారిని అలంకరించి, దీపారాధన చేశారు. నెలరోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలను నేత్రపర్వంగా క్షేత్రంలో నిర్వహించనున్నారు. ప్రతినిత్యం ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సేవా కాలాలను జరుపనున్నారు. అలాగే బుధవారం నుంచి స్వామివారి గ్రామోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఉదయం స్వామివారు ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగి, ధనుర్మాస మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్లను మండపంలో ఉంచి పూజాధికాలను జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తారని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.


