22ఏ భూ సమస్యల పరిష్కారం
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22 ఏ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం శ్రీమెగా 22ఏ భూ సమస్యల పరిష్కార వేదికశ్రీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసి అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22 ఏ జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానుల నుంచి స్వీకరించేందుకు మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ప్రతి అర్జీని పరిశీలించి 90 శాతం వరకు అదేరోజు పరిష్కరిస్తున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఒక్కరోజులోనే 1,147 కేసులు పరిష్కరించాం
కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ సుపరిపాలన అంటే సామాన్య ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమన్నారు. రాష్ట్రంలో 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ఏలూరు జిల్లా కేంద్రంగా మొదటి అడుగు పడిందన్నారు. ఒక్కరోజులోనే 1,199 దరఖాస్తులు అందగా, వాటిలో 1,147 దరఖాస్తులను పరిష్కరించి 142.04 ఎకరాల భూములను 22 ఏ జాబితా నుండి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారాలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఒక కేసును రికార్డులు పరిశీలించి నెలరోజులలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేసులు పరిష్కారమైన ప్రజలకు పరిష్కార ఉత్తర్వులను మంత్రి అందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బందిని మంత్రి అభినందించారు.
ఏలూరు(మెట్రో): రానున్న రబీ సీజన్‌లో సాగునీటికి, వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. తాగునీటి కొరత లేకుండా సీలేరు నుంచి నీటి సరఫరా, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ, పట్టిసీమ, తాడిపూడి, తదితర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు, తాగునీటి సరఫరాకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు.


