పేదల కల జగన్‌తోనే సాధ్యం
ముదినేపల్లి రూరల్: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం, సింగరాయపాలెం గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం–రచ్చబండ కార్యక్రమాన్ని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వీటిని ప్రైవేటు పరం చేస్తుందని విమర్శించారు. దీనివల్ల పేదలకు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు పేద ప్రజలకు వైద్యం ఖరీదుగా మారుతుందన్నారు. పేదలకు ఉచితంగా అందాల్సిన నాణ్యమైన వైద్యాన్ని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని విమర్శించారు.
పాలకోడేరు: 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ నెట్ బాల్ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 17, అండర్ 14 బాల బాలికల జట్లను గొరగనముడి స్వామి జ్ఞానానంద హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, డీ సునీత తెలిపారు. ఎంపికై న అండర్ 17 జిల్లా జట్టు విజయవాడలో, అండర్ 14 జట్టు పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపిక కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ జిల్లా కార్యదర్శి ఎండీ కుద్దూస్ గొరగనముడి, పీడీ ఎన్.విజయలక్ష్మి, తోలేరు పీడీ పి.శ్రీనివాస్, పీడీలు చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, నెట్ బాల్ సంఘ సభ్యులు దావూద్, విజయ్ పాల్గొన్నారు. ఎంపిక పోటీలను హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి.శ్రీదేవి ప్రారంభించగా ఈ కార్యక్రమానికి గొరగనముడి సర్పంచ్ గొట్టుముక్కల శివాజీ రాజు తదితరులు హాజరయ్యారు.
సాక్షి, అమరావతి: కొల్లేరు సరస్సు సంరక్షణ కోసం మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్‌గా, అటవీ దళాల అధిపతి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కమిటీలో రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, పర్యాటక శాఖల ప్రధాన అధికారులు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, కాలుష్య నియంత్రణ మండలి, బయో డైవర్సిటీ బోర్డు సభ్యులు ఉండనున్నారు. కొల్లేరు సరస్సు పునరుద్ధరణ, నీటి నాణ్యత మెరుగుదల, జీవవైవిద్య రక్షణ, చేపల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై ఈ కమిటీ చర్యలు చేపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. సరస్సు పరిసర ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని సూచించింది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం క్లస్టర్ పాఠశాలల వరకు మాత్రమే విద్యా సామగ్రి సరఫరా జరుగుతోందని, దీని వలన, దూర ప్రాంతాల్లోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆ సామగ్రిని తమ పాఠశాలలకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


