పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లను గ్రౌండ్ చేసే వరకు అన్ని సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న వారి వివరాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పరిశ్రమల శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, పరిశ్రమల స్థాపనకు సొంత భూమి కలిగిన యజమానులతో భాగస్వామ్యంగాని, లేదా బ్రాండెడ్ కంపెనీలతో టై అప్ చేసుకోవడానికి సహకారం అందించాలన్నారు. పారిశ్రామిక, సేవ రంగాల్లో అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సెప్టెంబర్ 25 నుంచి నేటి వరకు వివిధ శాఖల అనుమతుల కోసం 1,495 దరఖాస్తులు రాగా 1,467 దరఖాస్తులను ఆమోదించామని, మరో 243 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. సింగిల్ విండో పథకం కింద సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 29 వరకు అందిన అన్ని దరఖాస్తులకు అనుమతులను మంజూరు చేశామన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, ఏపీఐఐసీ డి.జెడ్.ఎం స్వామి, చేనేత జౌళి శాఖ అధికారి అప్పారావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, తదితరులు పాల్గొన్నారు.


