
వాగులు దాటాలంటే వణుకే..
కొండ కాల్వలపై బ్రిడ్జిలు నిర్మించాలి
జల్లేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఏజెన్సీప్రాంతంలోని గిరిజనులు భయం నీడలో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఎత్తయిన కొండలు, దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా కొండవాగులు బుసలు కొడుతూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. వాగులపై బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో గిరిజనులు నిత్యావసర పనుల నిమిత్తం పొంగుతున్న వాగులను దాటాల్సిందే. ఆ సమయంలో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఈ వాగులు దాటే ప్రయత్నం చేసినవారిలో అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగులు దాటేందుకు గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు.
మన్యంలో వాగుల గండాలు
మన్యప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో అనేక వాగు గండాలు ఉన్నాయి. వాటిని దాటి వెళ్లాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. ముఖ్యంగా గురుగుమిల్లి నుంచి చింతకొండ వాగు, అదేవిధంగా రెడ్డికోపల్లి, వీరన్నపాలెం వాగు, ముంజులూరు వెళ్లే జారుడు కాల్వ వాగు, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు, రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు, రామారావుపేట సెంటర్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న జల్లేరు వాగు, కేఆర్‌పురం తూర్పు, పడమర వాగులు బుట్టాయగూడెం శివారులో ఉన్న అల్లికాల్వతోపాటు అనేక వాగులు ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. అలాగే గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఒకేవాగు మూడు ప్రదేశాల్లో ఎదురవుతూ ఉంటుంది. వీటిని దాటాలంటే సాహసం చేయాల్సిందే. రెడ్డిగణపవరం, ఇప్పలపాడు, కేఆర్‌పురం, కన్నాపురం సమీపంలోని పడమర కాల్వ, అల్లికాల్వలతోపాటు చింతకొండ, వీరన్నపాలెం కాల్వలపై అత్యవసరంగా బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
నాలుగు బ్రిడ్జిలు నిర్మించిన వైఎస్సార్
ఏజెన్సీప్రాంతంలో వాగుల ప్రవాహానికి అనేక మంది మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని నివారించేందుకు గతంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో సుమారు రూ.26 కోట్లతో గాడిదబోరు, నందాపురం, రెడ్డిగణపవరం, రౌతుగూడెం, పడమర రేగులకుంట గ్రామాల్లోని మార్గాల్లో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించారు. వీటి నిర్మాణం వల్ల ఆయా గ్రామాల మధ్యలో రాకపోకలు సులభతరమయ్యాయి.
వర్షాకాలంలో ఏజెన్సీలో పొంగుతున్న కొండకాల్వలు, వాగులు
పలు గ్రామాల్లో బ్రిడ్జిలు లేక ఆదివాసీల అవస్థలు
మృత్యువు పొంచి ఉన్నా.. వాగులు దాటేందుకు సాహసం
గిరిజన సమస్యలను పట్టించుకోని పాలకులు, అధికారులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు తమ నిత్యావసర పనులమీద వాటినే దాటే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొండకాల్వలు ప్రవహించే ప్రధాన రహదారిపై హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించేలా ప్రభుత్వం కృషి చేయాలి.
– కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు
రెడ్డిగణపవరం నుంచి బుట్టాయగూడెం వెళ్లే మార్గంలో ఉన్న జల్లేరువాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. బిక్కుబిక్కుమంటూనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ మార్గంలోనే స్కూల్ బస్‌లు సైతం తిరుగుతున్నాయి. పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేయాలి.
– కోర్సా జంపాలు, మాజీ సర్పంచ్, రెడ్డిగణపవరం

వాగులు దాటాలంటే వణుకే..

వాగులు దాటాలంటే వణుకే..

వాగులు దాటాలంటే వణుకే..