
అధినేతతో భేటీ
తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు విభాగం, ఆక్వా కల్చర్ వర్కింగ్ ప్రెసిడెంటు వడ్డి రఘురాం బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు.
భీమవరం(ప్రకాశంచౌక్): రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం భీమవరంలోని జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళనలో పాల్గొన్నారు. అపరిమితమైన మెడికల్ పాలసీని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2004 వరకూ ఉద్యోగం పొందిన వారికి జీపీఎఫ్ కొనసాగించాలని కోరారు. బకాయిపడిన కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భీమవరం: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ.. ఈ నెల 20న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు భీమవరం మెంటేవారితోటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలన్ తెలిపారు.
భీమవరం: జిల్లాలోని ఆచంట మండలంలో బుధవారం ఉదయం అత్యధికంగా 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారశాఖ తెలిపింది. వీరవాసరంలో 74 మి.మీ, భీమవరంలో 67.2, పెనుమంట్రలో 70.2, పాలకోడేరు 56.4, ఉండి 19.4, గణపవరం 19.4, అత్తిలి 23.4, ఇరగవరం 42.2, పెనుగొండ 67.8, పోడూరు 46.4, పాలకొల్లు 66.4, యలమంచిలి 29.4, నరసాపురం 29.4, మొగల్తూరు 4.2, పెంటపాడు 6, తాడేపల్లిగూడెం 3.4, తణుకులో 2.4, ఆకివీడులో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ఉండి: ఉండి, ఎన్నార్పీ అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండి ఆర్‌అండ్‌బీ బంగ్లా, అక్విడెక్టు, ఇరిగేషన్ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి వెంటనే సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కే ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. స్థలాలు ఆక్రమణలో ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దారు నాగార్జునకు ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 81848 87146, 7710177767 నెంబర్లలో సంప్రదించాలన్నారు.