
టైలర్ల్‌కు చేదోడుగా నిలవాలి
● ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్లే రూ.15 వేలు అందించాలి
● టైలర్ల డిమాండ్
తాడేపల్లిగూడెం (టీఓసీ): గత ప్రభుత్వంలో చేదోడు పథకంలో ప్రతి టైలర్‌కు ఏడాదికి రూ.10 వేల చొప్పున నాలుగేళ్లు అందజేశారు. తమకు కూడా చేదోడు పథకం తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా టైలరింగ్ స్కీంను అమలు చేయాలని, టైలర్స్‌కు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత కలిగిన దర్జీలకు వారి వ్యాపార ఉన్నతికి, పరికరాల కొనుగోలు నిమిత్తం చేదోడు పేరుతో ప్రతి టైలర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. నాలుగేళ్ల పాటు ఈ పథకం అమలు చేశారు. ఐదో సంవత్సరం ఎన్నికల కోడ్ కారణంగా అమలు చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ.15 వేలు ఆటో కార్మికులకు అందిస్తున్న నేపథ్యంలో టైలర్లకు కూడా రూ.15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు
ఇప్పటికే టైలర్లు వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రెడిమేడ్ వస్త్రాలతో వారికి పనిలేకుండా పోతోంది. గతంలో టైలరింగ్ షాపులలో యాజమానితో పాటు పనివారు ఉండే వారు. నేడు ఎవరికీ పనులు లేకపోవడంతో టైలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. నాడు రద్దీగా ఉండే టైలరింగ్ షాపులు వారికి నేడు పని లేకుండా పోవడంతో టైలర్స్ ఆర్థికంగా చితికిపోయారు. టైలర్స్‌కు పనులు లేకపోవడంతో షాపులకు అద్దెలు చెల్లించలేకపోతున్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇవ్వాలని, ప్రభుత్వ షాపుల్లో తక్కువ అద్దెకు టైలర్లకు షాపులు కేటాయించాలని, ఎక్కడైనా టైలర్లకు ఇచ్చిన ప్రభుత్వ షాపులు పాడైతే వాటికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.