
డీజిల్ మాఫియా.. పట్టుబడ్డ ట్యాంకర్
● పన్నులు చెల్లించకుండా అక్రమంగా డీజిల్ రవాణా
● ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లో పట్టుకున్న అధికారులు
ద్వారకాతిరుమల: ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా దొడ్డిదారిన అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్‌ను పౌర సరఫరాల శాఖ అధికారులు ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లోని జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద బుధవారం సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ డీజిల్ మాఫియాకు సంబంధించి ట్యాంకర్ పట్టుబడటం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ నుంచి లక్ష్మీనగర్‌కు ట్యాంకర్ ద్వారా అక్రమంగా డీజిల్ రవాణా అవుతున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ (తాడేపల్లిగూడెం) డీపీ కిరణ్ కుమార్ సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలో ిసిబ్బందితో కలసి ఆయన మంగళవారం సాయంత్రం ట్యాంకర్‌ను లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాజేంద్ర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ట్యాంకర్ యజమాని హైదరాబాద్‌కు చెందిన ఎం.రాధిక అని, అందులోని డీజిల్ ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన కోనా శ్రీనివాసరావుదని డ్రైవర్ తెలిపాడు. అనంతరం భద్రతలో భాగంగా ట్యాంకర్‌ను లక్ష్మీనగర్‌లోని హైవే పార్కింగ్‌లో ఉన్న వెంకట దుర్గ ఫిల్లింగ్ స్టేషన్ (హెచ్‌పీ పెట్రోల్ బంకు) వద్ద నిలుపుదల చేయించారు. ట్యాంకర్‌ను తనిఖీ చేయాలని కిరణ్ కుమార్ ఏలూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఇమానియేల్‌ను కోరారు. అందులో భాగంగా డీఎస్‌ఓ ఆదేశాల మేరకు ఏఎస్‌వో ప్రతాప్‌రెడ్డి (ఏలూరు), ద్వారకాతిరుమల, భీమడోలు, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లయి డీటీలు టి.నాగరాజు, ఎన్.భరత్ కుమార్, జి.వెంకటేశ్వరరావు, వీఆర్వో కొత్తపల్లి చంద్రలీల, వీఆర్‌ఏ కంకిపాటి నరసింహమూర్తి బుధవారం ట్యాంకర్‌ను తనిఖీ చేశారు. ట్యాంకర్‌లో 10 వేల లీటర్ల డీజిల్ విలువ రూ.9,74,200గా గుర్తించారు. ట్యాంకర్, డీజిల్ యజమానులు, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ప్రభుత్వానికి, కమిషనర్లకు ముందే ఫిర్యాదు
డీజిల్ మాఫియాపై స్టేట్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వారు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, కమర్షియల్ ట్యాక్స్, సివిల్ సప్లయి, వెయిట్స్ అండ్ మెజర్స్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ డీజిల్ ఆయిల్ గుజరాత్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వస్తోందని తెలిపారు. బంకు యజమానులు లీటర్ డీజిల్‌ను రూ.97.42లకు విక్రయిస్తే, ఈ అక్రమార్కులు రూ.75కే విక్రయిస్తున్నారు. దీంతో గడిచిన ఏడాదిలోనే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లు మేర నష్టం వాటిల్లిందని కమిషనర్లకు తెలిపారు. టాక్స్‌లు కట్టకుండా ఒక ట్యాంకర్ డీజిల్ విక్రయిస్తే రూ.5 లక్షల వరకు మిగులుతుందని, దీన్ని బట్టి అక్రమార్కులు ఏ స్థాయిలో దందా చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.