
ఆక్వా దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కై కలూరు: విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా బుధవారం కై కలూరులోని ఆక్వా ఎరువులు, మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సంతమార్కెట్ వద్ద ఏ టూ జడ్ ఆక్వా రైతు బజార్, వాసవి ఆక్వా రైతు బజార్‌లలో తనిఖీ చేయగా రెండింటిలో రూ.1,45,260 విలువ కలిగిన 10.800 టన్నుల ఎరువుల్లో వ్యత్యాసం గుర్తించారు. ఎరువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏవో ఎ.మీరయ్య, ఎస్సై రంజిత్ కుమార్, వ్యవసాయశాఖ కై కలూరు సబ్ డివిజన్ ఏడీఏ ఏ.పార్వతి మండల వ్యవసాయ శాఖాధికారి ఆర్ దివ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పాలకోడేరు : బాలుడి మృతదేహాన్ని వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గోస్తనీ డ్రెయిన్‌లోని డొంకల్లో మంగళవారం గుర్తించారు. వేండ్ర అగ్రహారం శివారు కట్టావారిపాలెం గ్రామానికి చెందిన బొక్కా శ్రీనివాసరావు కుమారుడు జైదేవ్ (7) ఆదివారం సాయంత్రం సైకిల్ తొక్కుతుండగా చైను తెగిపోవడంతో దానిని పెట్టుకునే క్రమంలో గోస్తని డ్రెయిన్ వంతెనపై నుంచి జారి గల్లంతయ్యాడు. అప్పటినుంచి పోలీసులు, స్థానికులు, కాకినాడకు చెందిన ఎస్‌డీఎఫ్ బలగాలు గాలిస్తున్నారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గోస్తనీ డ్రెయిన్‌లో డొంకలను కూలీలు బాగుచేస్తుండగా మృతదేహాన్ని గుర్తించడంతో ఎస్‌డీఎఫ్ బలగాలకు సమాచారం అందించారు. వారు బాలుడి మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్సై మంతెన రవివర్మ తెలిపారు.
చింతలపూడి: వీధి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలైన ఘటన చింతలపూడి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో ఒక వీధి కుక్క విద్యార్థులను కరిచే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి అడ్డుకోవడంతో అతడ్ని గాయపరిచింది. స్థానికులు ఆ కుక్కను తరమడంతో పారిపోయే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ని, ఒక వెల్డింగ్ పనిచేసే కార్మికుడిని కరిచి గాయపరిచింది. కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను కరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగిరిపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఈదులగూడెంకి చెందిన ఈర్ల దుర్గారావు(42) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇటీవల ఆర్థిక బాధలు ఎక్కువ కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్నాయత్నానికి ప్రయత్నించాడు. కుమార్తె చుట్టుపక్కల వాళ్ల సహాయంతో దుర్గారావును నూజివీడు అమెరికన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆక్వా దుకాణాలపై విజిలెన్స్ దాడులు