
పనులు లేక స్వర్ణకారులు విలవిల
ప్రభుత్వం ఆదుకోవాలి
ఉపాధి కల్పించాలి
ఆకివీడు: బంగారం ధరలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతుంటే.. అవి తయారుచేసే స్వర్ణకారులు మాత్రం పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగారు ఆభరణాలు తయారు చేయించుకునేవారి సంఖ్య క్రమేపీ తగ్గుతుండడంతో ఏళ్ల తరబడి బంగారం వస్తువుల తయారీపై జీవనాధారం పొందుతున్న స్వర్ణకారులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బంగారం 10 గ్రాముల ధర రూ. 1.10 లక్షల వరకూ ఉంది. దీంతో బంగారం కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. అత్యవసరమై బంగారు వస్తువులు కొనుగోలు చేసేవారు రెడీమేడ్ ఆభరణాలకు వెళ్లిపోతున్నారు. బంగారు ఆభరణాల విక్రయాల్లో కార్పొరేట్ సంస్థల దూకుడు అధికంగా ఉంది. ఇతర బంగారు షాపుల వారు కూడా వస్తువుల్ని తయారు చేయించకుండా, రెడీమేడ్‌లో తీసుకువచ్చి విక్రయిస్తన్నారు. దీంతో స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయి. దీంతో చేసేదిలేక కొందరు ఇతర వృత్తులకు వెళ్లినా, వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి పరిస్థితి మాత్రం మరీ దుర్భరంగా ఉంది.
20 శాతం పనులు స్వర్ణకారులకే అప్పగించాలి
కార్పొరేట్, ఇతర సంస్థలు, దుకాణాదారులు విక్రయించే బంగారు ఆభరణాల్లో 20 శాతం స్వర్ణకారులతోనే తయారుచేయించే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని స్వర్ణకారులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఇతర ప్రధాన దేవాలయాల్లో బంగారు ఆభరణాల తయారీ స్వర్ణకారులకే అప్పగించాలంటున్నారు. స్వర్ణకారులకు పనులు కల్పించేవిధంగా ప్రభుత్వమే ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు. మంగళ సూత్రాలు, మట్టులు, ఇతరత్రా వివాహాలకు అవసరమయ్యే వస్తువులు స్వర్ణకారులే తయారు చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, స్వర్ణకార సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో స్వర్ణకారుల బతుకులు పాతాళానికి వెళ్లాయి. బంగారం వస్తువుల్ని తయారు చేయించుకునే వారు లేక స్వర్ణకార వృత్తిని నమ్ముకున్న వారి పరిస్థితి నట్టేట మునిగినట్లు అయింది. ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలి. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి.
– పట్నాల శేషగిరిరావు, స్వర్ణకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఆకివీడు
బంగారం ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం తయారు చేయించుకొనే పరిస్థితి లేదు. దీంతో బంగారం పని లేక, మరే ఇతర పనికి వెళ్లేలేక స్వర్ణకారులు అర్థాకలితో జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం తక్షణం ఉపాధి కల్పించి స్వర్ణకారులను ఆదుకోవాలి.
– నల్లగొండ వెంకట రామకృష్ణ, స్వర్ణకార సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి, నరసాపురం

పనులు లేక స్వర్ణకారులు విలవిల

పనులు లేక స్వర్ణకారులు విలవిల