
ఎమ్మెల్సీలకు అందని ఆహ్వానం
భీమవరం ( ప్రకాశం చౌక్): జిలాల్లో ప్రముఖ ఆలయాల్లో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో ఎమ్మెల్సీల ఫొటో, పేర్లు ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలకు స్థానం ఇవ్వాలి. కానీ ఆయా ఆహ్వాన పత్రికల్లో ఎమ్మెల్సీల ఫొటోలు గానీ, కనీసం పేర్లు గాని ముద్రించలేదు. భీమవరం మావుళ్ళమ్మ దేవస్థాన దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ఫొటో ముద్రించగా, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, పేరాబత్తుల రాజశేఖరం గురించి ప్రస్తావించలేదు.
తప్పుల తడకగా ఆహ్వాన పత్రిక
పంచారామ క్షేత్రం దసరా ఆహ్వాన పత్రిక పూర్తిగా తప్పుల తడకలుగా ఉంది. ఈ ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్సీలు బొర్ర గోపి మూర్తి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, పేరాబత్తుల రాజశేఖరం పేర్లు వేయలేదు. ఇక దేవాదాయశాఖ ఉన్నత అధికారులకు లేని హోదాలను కల్పించేశారు. దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రం మోహన్ ఐఏఎస్ కాకున్నా ఆయన పేరు చివర ఐఏఎస్‌ను చేర్చారు. దేవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరును ఆనం రామ్‌నారాయణరెడ్డిగా ముద్రించారు. ఈవోల నిర్లక్ష్య వైఖరికి ఈ ఆహ్వాన పత్రిక నిదర్శనంగా నిలుస్తోంది.

ఎమ్మెల్సీలకు అందని ఆహ్వానం