
కన్నబిడ్డలకు భారం కాలేక ఆత్మహత్యాయత్నం
కొయ్యలగూడెం: వయస్సు మీద పడింది.. కన్న బిడ్డలకు భారమైంది. తన సంతానం అంటున్న సూటిపోటి మాటలకు కలత చెంది చెరువులోకి దూకి తనువు చాలించేందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం పొంగుటూరు గ్రామానికి చెందిన మద్దాల రంగమ్మ (75 ఏళ్లు) వృద్ధురాలి భర్త శేషయ్య మూడేళ్ల కిందట మృతి చెందడంతో కొడుకు శేషారావు వద్ద బతుకీడ్చుతున్నట్లు తెలిపింది. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసి ఎవరి కాపురాలకు వాళ్లను పంపగా, తన వద్ద ఉన్న మూడు ఎకరాల పొలంను కుమారుడికి రాసిచ్చినట్లు పేర్కొంది. తల్లినని కూడా చూడకుండా కొడుకు, కోడలు అనరాని మాటలు అంటూ అవమానాలకి గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఊర చెరువులోకి దూకడానికి ప్రయత్నిస్తుండగా సర్పంచ్ పసుపులేటి రాంబాబు కాపాడారు. రంగమ్మ కుటుంబ సభ్యులకు కబురు పంపినా స్పందించకపోవడంతో పంచాయతీ కార్యాలయంలోని బల్లపైనే కూర్చుని ఆమె రోదిస్తోంది. ప్రస్తుతానికి వృద్ధురాలి సంరక్షణ పంచాయతీ చూసుకునే విధంగా ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామ పెద్దలు కలగజేసుకొని వృద్ధురాలికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.