
శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
జంగారెడ్డిగూడెం: శ్రీగంధం స్మగ్లింగ్ చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదివాసీ గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడించారు. నిందితుల నుంచి 30 శ్రీగంధం చెక్కల దుంగలు, రెండు మోటార్‌సైకిళ్లు, గొడ్డలి, రంపాలు 3, బంగారపు చైన్ 2 కాసులు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని చెప్పారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.
పగలు పూసలు విక్రయిస్తూ రెక్కీ
మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నిందితులు రోడ్డు పక్కన టెంట్‌లు వేసుకుని పగలు పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించి రైతుల పొలాల్లో శ్రీగంధం చెట్లను గుర్తిస్తారు. రాత్రి సమయాల్లో ఆ రైతుల పొలాల్లో ఉన్న శ్రీగంధం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుంటారు. కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన రైతు తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ పొలంలో శ్రీగంధం చెట్లను నరుకుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. స్మగ్లింగ్ గ్యాంగ్ రైతుని బెదిరించి అతని వద్ద నుంచి రెండు కాసుల బంగారపు చైన్ లాక్కొని పోయారు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదు, గతంలో ఆయా మండలాల నుంచి రైతులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు
శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాలపై డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీఐ కె.సుభాష్ పర్యవేక్షణలో తడికిలపూడి ఎస్సై చెన్నారావు, జంగారెడ్డిగూడెం ఎస్సై షేక్ జబీర్, క్రైం పార్టీ ఏస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, చిట్టిబాబు, షేక్ షాన్‌బాబులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. విస్తృతంగా గాలించిన ప్రత్యేక బృందం నిందితులైన మధ్యప్రదేశ్ రాష్ట్రం కటని టౌన్, జిల్లా హర్దువా గ్రామానికి చెందిన ఆదివాసీ రాజా, ఇలాజ్‌కుమార్, జెండు, పెన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరిపై గత నాలుగేళ్లుగా జిల్లాలోని చింతలపూడిలో 2, కామవరపుకోటలో 2, టి.నరసాపురంలో 3, ధర్మాజీగూడెంలో 1, పెదవేగిలో 2, ముసునూరు మండలంలో 2 కలిపి మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. కేసు చేధించడంలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలు, సిబ్బందికి రివార్డుకోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎంవీ సుబాష్, ఎస్సైలు చెన్నారావు, షేక్‌జబీర్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
నిందితులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు
రూ. 5.50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ

శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్