
అత్యవసర వైద్యం.. అందని దైన్యం
భీమవరానికి చెందిన జి.భీమేశ్వరరావు అనే వ్యక్తికి శనివారం రాత్రి గుండె నొప్పి రావడంతో భీమవరంలో గతంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన నెట్‌వర్క్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెకు సంబంధించిన సమస్య ఉందని చెప్పారు. అయితే తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు లేవని చెప్పారు. భీమవరంలోని మరే నెట్‌వర్క్ ఆస్పత్రిలోనూ గుండె చికిత్సలు అందించకపోవడంతో చేసేది లేక అదే ఆస్పత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారు.
పాలకోడేరు మండలం పెన్నాడకి చెందిన ఆరుగుల మహలక్ష్మి అనే వృద్ధురాలికి గురువారం రాత్రి గుండె నొప్పి రావడంతో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెలో నీరు పట్టిందని, వెంటనే వైద్యం చేయాలన్నారు. భీమవరంలో గుండె చికిత్సకు సంబంధించి ఏ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ లేకపోవడం, దూరప్రాంతాలకు తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో అదే ఆస్పత్రిలో మహాలక్ష్మికి కుటుంబసభ్యులు సొంత ఖర్చులతో వైద్యం చేయించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయింది. అపర సంజీవని వంటి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. భీమవరంలో ఆరోగ్యశ్రీలో మల్టీ స్పెషాలిటీ సేవలు నిలిపివేయడంతో నెల రోజులుగా భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ప్రజలు అత్యవసర వైద్యానికి అవస్థలు పడటమే ఇందుకు నిదర్శనం. భీమవరంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో గుండె, మెదడు, కిడ్నీ, వెన్నెముక తదితర సమస్యలకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తణుకు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
80 కిలోమీటర్ల వరకూ దూరం
భీమవరం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల వారికి గుండెపోటు, బ్రెయిన్‌స్టోక్ వంటి సమస్య తలెత్తితో 50 నుంచి 80 కిలోమీటర్లు వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలు పొందాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ కేసులు ఉంటే ప్రైవేట్ ఆస్పత్రిలో సొంత ఖర్చులు రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. ఇది పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారింది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా గుండె, మెదడుకు సంబంధించి అత్యవసర వైద్యం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం, తణుకులో మాత్రమే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సౌకర్యం ఉంది.
ప్రజారోగ్యంపై కూటమి నిర్లక్ష్యం
భీమవరంలో నెల రోజులుగా మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు నిలిచిపోయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐదు నియోజవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నా సేవల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం లేదు.
గత ప్రభుత్వంలో పక్కాగా అమలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిస్థాయిలో అందాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందించేవారు. కార్డియాక్, న్యూరో సమస్యలకు సంబంధించి నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉండేవి. అలాగే ఆరోగ్యశ్రీలో సేవలు పొందిన వారికి ఆరోగ్య ఆసరా పేరిట నగదు సాయం కూడా అందించేవారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యం అవడంతో పాటు ఆరోగ్య ఆసరా పథకం అమలు కావడం లేదు.
వైద్య సేవ.. అందని తోవ
నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు దూరం
భీమవరంలో మల్టీ స్పెషాలిటీ వైద్యం నిల్
గుండె, మెదడు వైద్యానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే..
లేదంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే..
పేదవాడి ప్రాణాలతో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు చెలగాటం