
మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ
పెనుమంట్ర: మండలంలోని సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి కమల ఇంట్లో మంగళవారం సాయంత్రం భారీ చోరీ జరింది. వివరాల ప్రకారం బీజేపీ యువమోర్చా నాయకుడు కర్రి బ్రహ్మానంద రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి అతని తల్లి కమల, భార్య జ్ఞాన చంద్రికను తాళ్లతో బంధించి అరిస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఇంట్లో ఉన్న సుమారు 30 కాసుల బంగారం, లక్ష రూపాయలు పైగా నగదును అపహరించారు. బ్రహ్మానంద రెడ్డి కుమార్తె ట్యూషన్‌కి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి నాన్నమ్మ కమల, తల్లి జ్ఞాన చంద్రిక కట్లతో బంధించబడి ఉండటాన్ని గమనించి కట్లను తొలగించింది. అప్పటివరకు వారి ఇరువురు బయటికి రాలేకపోవడంతో చోరీ జరిగిన విషయం బయట వ్యక్తులు ఎవరికీ తెలియ రాలేదు. ఈ ఘటనపై బ్రహ్మానంద రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం నర్సాపురం డీఎస్పీ శ్రీ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్స్ స్క్యాడ్, క్లూస్ టీం తనిఖీలు నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.స్వామి చెప్పారు.