
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నాం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ దేవస్థానం ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్‌లకు శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ను వారి క్యాంపు కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలసి, తమ సమస్యలను వివరించారు. ఆ తరువాత దుశ్శాలువాలు కప్పి, శ్రీవారి చిత్రపటాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తాము శ్రీవారి దేవస్థానంలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. చాలీచాలని జీతంతో పనిచేస్తూ, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దేవస్థానం ఎస్టాబ్లీష్‌మెంట్ చార్జెస్ 30 శాతం లోపు ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, తమ దేవస్థానం ఎస్టాబ్లీష్‌మెంట్ చార్జెస్ కేవలం 16 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఆలయంలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయొచ్చన్నారు. అప్పుడు కూడా హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే తమకు జీతభత్యాలు అందుతాయని, ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు చవలం శ్రీనివాసరావు, సర్నాల రంగారావు, విజ్జురోతి కుంకుళ్లు, గోపా బాలు, నాగేశ్వరరావు, మంగరాజు తదితరులున్నారు.
శ్రీవారి దేవస్థానం ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల ఆవేదన