
ఉపాధి పనుల్లో అక్రమాలు
బుట్టాయగూడెం: ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గత ఏడాదిపాటు జరిగిన గ్రామీణ అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ ఫారెస్ట్, కూలీలకు కలిపి సుమారు రూ. 16.27 కోట్ల నిధులకు సంబంధించి పనులు చేశారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం అధికారులు ఆగస్టు 21 నుంచి ఒక్కొక్కటిగా పరిశీలించారు. పనుల వివరాలను మండల స్థాయిలో వెల్లడించేందుకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికలో బుట్టాయగూడెం మండలంలోని 21 పంచాయతీల పరిధిలో జరిగిన పనుల్లో సుమారు రూ.1.73 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలతలు, మస్తర్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు, ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులు, తదితర పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో రూ. 27.86 లక్షలను అధికారులు రికవరీకి ఆదేశించారు. మరో రూ.27 లక్షలకు సంబంధించి ఎంకై ్వరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.86.86 లక్షలతో వివిధ పనులతోపాటు మొక్కలు వేయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రజావేదికలో రూ.66 లక్షలు తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీఓ, ఈసీ, జేఏ, ఫీల్డ్ అసిస్టెంట్‌లకు సుమారు రూ. 2.81 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌పాలెంలో కాంపౌండ్ వాల్, రాజానగరం, లక్ష్ముడుగూడెంలో పాల కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండానే సుమారు రూ.8 లక్షల వరకూ డబ్బులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసినట్లు తెలిపారు. డ్వామా పీడీ వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జ్యోతి, ఏపీఓ ఎం.స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకూ ఈ కార్యక్రమం జరిగింది.