
శ్శశానంలో ట్రాన్స్‌ఫార్మర్‌తో ప్రాణాపాయం
ఉండి: పాములపర్రు దళితుల శ్శశాన వాటికలో అక్రమంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ను తొలగించాలంటూ పాములపర్రు గ్రామానికి చెందిన దళిత మహిళలు ఉండి విద్యుత్ సబ్‌స్టేషన్ లోని ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. గత నెల 22న విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ తొలగించిన అధికారులు తిరిగి ఈనెల 4న విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించడంపై శనివారం మండిపడ్డారు. సదరు రైతుకు నోటీసు పంపిస్తామని, ఇందుకు వారం రోజులు సమయం కావాలని ఏపీ పి.శ్రీనివాసరావు తెలపగా మహిళలు ససేమిరా అన్నారు. మహిళలు కార్యాలయం ఎదుటే బైఠాయించి, అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. విషయం తెలిసిన ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఇక్కడకు చేరకుని మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా మహిళలు పట్టువీడలేదు. పోలీసులు, విద్యుత్ అధికారులు, మహిళలకు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో నిరసన కార్యక్రమం శనివారం రాత్రి వరకు కొనసాగింది. గతంలో తాము ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా కట్ చేశారని, మరలా కూటమి నాయకుల ఒత్తిళ్లతో కనెక్షన్‌ను పనరుద్ధరించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల శ్శశాన వాటికలో ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉందన్నారు. దీనిపై ఏఈ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా ట్రాన్స్‌ఫార్మర్ విషయమై సదరు రైతుకు నోటీసులు ఇస్తామని, పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దళిత మహిళలు దర్శి మెర్సీ, ఆండ్రు సునీత, బడుగు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.