
భీమవరంలో రఘురామ పెత్తనమేంటి?
భీమవరం: భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విస్సాకోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్‌కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు దుయ్యబట్టారు. శనివారం రాయలంలో వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజిబాబు, మున్సిపల్ అఽధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజవకర్గంలోని విస్సాకోడేరు పరిధిలోని నాన్ లే అవుట్‌కు ప్రత్యేకంగా పైప్‌లైన్ వేసి నీటిని సరఫరా చేయడాన్ని తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడటం బాధాకరమన్నారు. రఘురామకు రాజకీయాలు తెలియని రోజుల నుంచి తాను ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని, విద్యార్థి సంఘ నాయకుడిగా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా సమస్యలపై పోరాడానన్నారు.
వ్యక్తిగత దూషణ సరికాదు
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతో ఎదిగిన డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీని కించపర్చేలా, బీసీ నాయకుడు నాగేశ్వరరావును వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ మున్సిపాలిటీ తాగునీటిని గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి రూల్స్ ఎలా ఒప్పుకుంటాయో చెప్పాలన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ గతంలో రాయలం గ్రామానికి మున్సిపల్ నీరు ఇవ్వాలని కోరితే అభ్యంతరం చెప్పిన అధికారులు ఇప్పుడు విస్సాకోడేరు పంచాయతీకి పైప్‌లైన్ ఎలా వేశారని ప్రశ్నించారు. భీమవరం నియోజకవర్గంపై ఉండి ఎమ్మెల్యే పెత్తనం ఏంటని నిలదీశారు. పార్టీ నాయకులు ఏఎస్ రాజు, చవాకుల సత్యనారాయణ, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్, పాలవెల్లి మంగ, మానుకొండ ప్రదీప్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం