
వరద ముంపులోనే కనకాయలంక ప్రజలు
యలమంచిలి: గోదావరిలో వరద స్థిరంగా ఉండిపోవడంతో కనకాయలంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనకాయలంక చుట్టూ వరద చుట్టుముట్టడంతో ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం పడవల మీద ప్రయాణిస్తున్నారు. గత నెల 29న వరదముంపునకు గురయిన కాజ్‌వే మీద ఎనిమిది రోజులుగా వరద నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా తాగునీటి కోసం లంక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో తాగునీరు దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ చాకలిపాలెం వెళ్లి ఫౌండేషన్ నీరు తెచ్చుకుంటారు. మామూలు సమయంలో బైక్, సైకిల్ మీద తెచ్చుకుంటారు. వరద రావడంతో పడవపై తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో ఒంటరి మహిళలు తాగునీరు తెచ్చుకోవడం కష్టమవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం కనీసం వాటర్‌టిన్స్ పంపిణీ చేయాలని కోరుతున్నారు.