
సంచార జాతులకు ఏం చేశారో చెప్పాలి?
కాళ్ల: సంచార జాతులకు బీజేపీ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని విజయవాడలో నిర్వహించిన సంచార జాతుల దినోత్సవం సభలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారని, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఏం చేసిందో చెప్పాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కౌంటర్ ఇచ్చారు. పెద అమీరంలోని జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎన్టీ, ఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ నెపం రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేయడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్ల కోసం ఈ జాతులను వాడుకోవటం సరికాదని, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలోని 341, 342 ఆర్టికల్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. గతంలో అనేక కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని ఇంతవరకు చర్చకు కూడా తీసుకురాకుండా ఈ వర్గాలకు న్యాయం చేస్తామని అబద్ధాలు చెప్పడం మాధవ్ మానుకోవాలని పెండ్ర వీరన్న అన్నారు. ఆగస్టు 31న ప్రధానమంత్రి మోదీ ఏం అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రకటించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సంచార జాతులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1288.44 కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు. గుర్తింపు లేని సంచార జాతులను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించే కార్యక్రమానికి గత ప్రభుత్వం స్వీకారం చుట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షుడు చుండూరి ముసలయ్య, ప్రధాన కార్యదర్శి చింత వీర్రాజు, కార్యదర్శి చుండూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.