
రైతులను అప్పులపాలు చేసిన ప్రభుత్వం
తణుకు ఎమ్మెల్యే అవినీతి రూ.1,200 కోట్లు
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వ్యవసాయ రంగం అధోగతిపాలై రైతులు అప్పులపాలైపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్సార్, జగన్‌ల హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఆ వ్యాఖ్యలను కొనసాగిస్తూ రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తమ పంటలకు మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో యూరియా కోసం పాకులాడుతున్నారని, క్యూ లైన్‌లలో మహిళలు కూడా నిల్చోవాల్సి వస్తుంటే చంద్రబాబు వెటకారంగా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని, పురుగు మందుల వాడకం తగ్గించాలని అనడం బాధాకరమన్నారు. ఏడాది పొడవునా వరి పంట పండుతూ ఉండే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను ఎడారిగా మార్చి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. పెట్టుబడి సాయం లేక, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటివి అమలు చేయకపోవడంతో రైతులు పంట పండించేందుకు అప్పులపాలవ్వాల్సి వస్తోందని చెప్పా రు. రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం అమరావతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భ్రమరావతిని తయారు చేస్తోందని ఎద్దేవా చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి తణుకులో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్‌కే ట్యాక్స్ గొడవ మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైందని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. టీడీఆర్ బాండ్లు, మట్టి, పేకాటలు, క్రికెట్ బుకింగ్‌లు, మద్యం దుకాణాలు, పంచాయతీల్లో కమీషన్‌లతో పాటు ఆవులు, గేదెల కోతకు సంబంధించి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మొత్తం రూ.1,200 కోట్లు దోపిడీ చేశారని ఆధారాలు సైతం బయటకు వచ్చాయని స్పష్టం చేశారు. ఆ పార్టీ వారి వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని వారే చెబుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పనికి వెళ్లినా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నారని ప్రజలు, టీడీపీ వర్గాలవారే చెబుతున్నారని అన్నారు. తణుకు ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఇటువంటి ట్యాక్స్‌లు ఏ ప్రభుత్వంలో కూడా తాము ఎప్పుడూ చూడలేదని టీడీపీ వర్గీయులే చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎంపీపీ రుద్రా ధనరాజు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, తణుకు మండల అధ్యక్షుడు పెనుమర్తి వెంకటరామన్న, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు పాల్గొన్నారు.
యూరియా కూడా అందించలేక చతికిలపడ్డ దుస్థితి
మహిళా రైతులు సైతం క్యూలో ఉన్నా చోద్యం చూస్తున్న వైనం
తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి అవినీతి రూ.1,200 కోట్లు
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి విమర్శలు