
కూటమి పాలనలో ఎరువుల కృత్రిమ కొరత
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వం ఎరు వులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆర్థికంగా దోచుకుంటోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన నీటి కాలువలు నిర్వహణ చేయడం లేదని, గుర్రపుడెక్కను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడస్తున్నా రైతులకు న్యాయం చేయలేపోయిందని ఎద్దేవా చేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ రూ.5 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇటీవల ఎరువుల కొరత సృష్టించి వాటా లు, కోటాల పేరుతో యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఎరువుల సరఫరాలో తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారన్నారు. మార్క్‌ఫెడ్, మార్కె ట్ వాటాలు ఎంతో తెలియజేయాలన్నారు. ఎరువులు ఎవరికి కోటా ఇచ్చారో ఇన్వాయిస్‌లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులను చులకన చేసి మాట్లాడటం తగదన్నారు. పడమర విప్పర్రులో ఎరువులు జనసేన, టీడీపీ వర్గీయులైన రైతులకు మాత్రమే ఇచ్చారని, కూటమి అనుయాయులకే ప్రాధాన్యమిచ్చి మిగిలిన వారిపై నిర్లక్ష్యం తగదన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఎవరో తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలో రైతుల కష్టాలు ప్రజాప్రతినిధులకు కానరావడం లేదన్నారు.
9న అన్నదాత పోరు
రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రైతులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు ముప్పడి సంపత్‌కుమార్, ఆరేపల్లి సుబ్బారావు, కర్రి భాస్కరరావు, వెలిశెట్టి నరేంద్రకుమార్, చెన్నా జనార్దన్, గార్లపాటి వీరకుమార్, సిర్రాపు శాంతకుమార్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ