
ప్రాణాలు తీసిన అతివేగం
ద్వారకాతిరుమల: ఒక డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మండలంలోని లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ముందు వెళుతున్న ఇసుక లారీని, కోళ్లు వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలు పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి వ్యాన్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణం. పోలీసుల కథనం ప్రకారం. గుంటూరు జిల్లా, వాడేపల్లికి చెందిన షేక్ మీరా మహబూబ్(30) గుంటూరులోని ఏకే చికెన్ పౌల్ట్రీలో గత 9 ఏళ్ల నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే పౌల్ట్రీలో సౌత్ ఢిల్లీకి చెందిన మహ్మద్ సాజాన్(27), ఎండీ కలిమ్ ఆలాం కూలీలుగా పనిచేస్తున్నారు. గత శుక్రవారం సాయంత్రం ఈ ముగ్గురు వ్యాన్‌లో జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెంకు వెళ్లారు. అక్కడ కోళ్లను లోడ్ చేసుకుని, తాడేపల్లికి బయల్దేరి వెళుతున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బ్రిడ్జి ఎక్కే సమయంలో డ్రైవర్ మీరా మహబూబ్ వ్యాన్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ముందు (ఏలూరు వైపునకు) వెళుతున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మీరా మహబూబ్, సాజాన్ అక్కడికక్కడే మృతి చెందగా, కలిమ్ ఆలాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రుడిని ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహబూబ్ సోదరుడు షేక్ ఇస్మాయేలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.

ప్రాణాలు తీసిన అతివేగం