
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
నూజివీడు: విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ర్యాగింగ్‌కు దూరంగా ఉండి చదువుపైనే దృష్టి సారించాలని సిఐడీ డీఎస్పీ జీ లక్ష్మయ్య పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువు అంటే అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అనే విషయాన్ని నిజంగా గ్రహిస్తే ఇతరుల్ని మనం ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడమన్నారు. ఇతరుల్ని శారీరకంగా, మానసికంగా వేధించడం మానుకోవాలని, మంచి స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించాఉ. ఇతరులతో ఎగతాళిగా మాట్లాడడం, తోటి విద్యార్థులతో నువ్వు చదవలేవు అని అనడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదువుకొని భవిష్యత్‌తో ప్రయోజకులవ్వాలని విద్యార్థులకు హితవు పలికారు. దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారినప్పుడే దేశం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం డీఎస్పీని మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓలు రాజేష్, దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఐడీ డీఎస్పీ లక్ష్మయ్య