
శ్రీవారి సేవలో..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ జోన్–2 రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బీఆర్ క్రాంతి కుమారి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
ముదినేపల్లి రూరల్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.7 లక్షలు వసూలు చేసి ఆనక మోసం చేసిన వైనంపై శనివారం పోలీస్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లికి చెందిన బూసి చిరంజీవి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి గురజకు చెందిన పి విక్రమ్ పరిచయమై తాను ప్రముఖ రాజకీయ నాయకుల వద్ద కారు డ్రైవర్‌గా చేస్తుంటానని, ఆ పలుకుబడితో చిరంజీవి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పలు దఫాలుగా ఫోన్‌పే, రొక్కముగా రూ.7 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఉద్యోగం గురించి చిరంజీవి ఎన్నిసార్లు విక్రమ్‌ను ప్రశ్నించినా సమాధానం దాటవేయడంతో మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.