
ఎండు గడ్డి ప్రియం
ఉండి: వ్యవసాయం అధునాతన సాంకేతిక వైపు అడుగులు వేస్తుండడం రైతులకు వరం కాగా పాడి రైతులకు మాత్రం శాపంగా పరిణమించింది. వరికోతల్లో ఎక్కువగా యంత్రాలనే వినియోగిస్తుండడంతో పశుగ్రాసం లభించక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూలీలు వరికోతలను కోయడం వలన కుప్పనూర్పులు చేసి ఎండుగడ్డిని జాగ్రత్త చేసి పశువులకు మేత వేసేవారు. ప్రస్తుతం యంత్రాలతో కోతకోసిన తరువాత ఆ వరి గడ్డి పిప్పిలా మారుతుండడంతో పశువులు తినేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో ఎండుగడ్డి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎండుగడ్డి దొరుకుతుందా అని రైతులు వెదికి అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు పోటీ పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎండుగడ్డి ధర విపరీతంగా పెరిగింది. గతంలో ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వరకు పలుకగా ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతుంది. డెల్టా ప్రాంతం నుంచి అధిక ధరలకు కొని మధ్యవర్తులు మరింత ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుండటంతో ఎండుగడ్డి మరింత ప్రియంగా మారింది. ముఖ్యంగా మెట్టప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మధ్యవర్తులు ఎండుగడ్డిని కొనేందుకు పోటీపడతున్నారు. మార్టేరు తదితర ప్రాంతాల్లో ఫారంలు అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎకరా ఎండుగడ్డి రూ.5 వేల ధర పలుకుతుండటంతో పశువుల రైతులు ఘొల్లుమంటున్నారు.
సబ్సిడీపై దాణాను అందజేయాలి
గతంలో ఎక్కడబడితే అక్కడ దొరికే ఎండుగడ్డి ఇప్పుడు చాలా అరుదుగా లభిస్తోంది. ప్రభుత్వం పశువుల దాణాను అధిక సబ్పిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పశుగ్రాసం లభించక పాడి రైతుల ఇబ్బందులు
యంత్రాలతో వరికోతలే ప్రధాన కారణమంటూ ఆవేదన
ఎండు గడ్డి ధర చూసి ఆందోళన