
పారిశుద్ధ్య కార్మికుల వేతన వెతలు
తణుకు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికు లను నియమించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం.కృపావరానికి అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కార్మికులు అతి త క్కువ వేతనంతో పనిచేస్తున్నారని, అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని విమర్శించారు. ఆస్పత్రిలో 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి పనిభారం తగ్గించాలని కోరారు. సంఘ నాయకులు ధర్మాని పుష్పలత, నేకూరి లక్ష్మి, పి.విజయలక్ష్మి, ఎన్.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.