
ఎండీయూ వాహనాల రద్దుపై మండిపాటు
భీమవరం: ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులను ఎండీయూ వాహనాల ద్వారానే సరఫరా చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని 38వ వార్డు లంకపేటలో ఎండీయూ వ్యవస్థ రద్దును ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ రేషన్ వాహనాల ద్వారా అవినీతి జరుగుతుందనే నెపంతో ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించకుండా డిపోల వద్దే రేషన్ తెచ్చుకోవాల నడం అన్యాయమన్నారు. పట్టణ నాయకుడు ఎం. వైకుంఠరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సన్న బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు, నూనె, పంచదార వంటి నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు, కుమారి సాయ మ్మ, రమేష్, మరియమ్మ పాల్గొన్నారు.
వాహనాల తొలగింపు దారుణం
భీమవరం అర్బన్: రేషన్ వాహనాల నిలిపివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్ర జాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని వెంప గ్రామంలో పెదపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గతంలో ప్రజలు మానుకుని రేషన్ దుకాణాలకు వెళ్లి క్యూలైన్‌లో రేషన్ తీసుకునేవారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రేషన్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రేషన్ వాహనాలు తొలగించడం దారుణమన్నారు.