పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..

May 23 2025 3:13 PM | Updated on May 23 2025 3:13 PM

పశువు

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..

చింతలపూడి: వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా జె. లింగయ్య వివరించారు.

ఎలా సంక్రమిస్తుంది

పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాశపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్‌ హీట్‌ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచి పోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరియైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది.

గురక వ్యాధికి చికిత్స

వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్‌, క్లోక్సా సిలిన్‌, జెంటా మైసిన్‌, సెఫలాక్సిన్‌ వంటి యాంటి బయోటిక్‌ మందుల్ని సరియైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్‌ ఇంజక్షన్‌లు, బి–కాంప్లెక్స్‌ ఇంజక్షన్‌లు బాగా నీరసించిన పశువుౖకైతే డెక్ట్‌స్రోజ్‌ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది.

నివారణ ఇలా..

గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమాక్సిన్‌, సైపర్‌ మెధ్రిన్‌, కార్పొరిల్‌ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తుంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది.

పాడి–పంట

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా.. 1
1/2

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా.. 2
2/2

పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement