
భయాందోళనలో ఆస్పత్రి వర్గాలు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యవర్గాలు విధి నిర్వహణ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులంటే హడలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర విభాగానికి రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు అలజడి సృష్టిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ రాత్రి చిన్నపాటి గాయంతో ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చిన పాతవూరుకు చెందిన ఇద్దరు సోదరులు వైద్యవర్గాలను అసభ్యపదజాలంతో విరుచుకుపడడమే కాకుండా దాడికి సైతం ప్రయత్నించి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ సత్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల ఇటువంటి చిన్నాపెద్దా ఘటనలు చోటుచేసుకుంటుండగా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు.
100 గ్రామాలకు పెద్దాసుపత్రి
తణుకు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 10 కిలోమీటర్లుపైగా జాతీయ రహదారి ఉండడంతో ఇటు అలంపురం నుంచి సిద్ధాంతం పైవరకు జరిగే రోడ్డు ప్రమాదాలన్నీ తణుకు ఆస్పత్రికే తరలిస్తుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల 100 గ్రామాలకు పెద్దాసుపత్రిగా సేవలందిస్తుండడంతో అధికశాతం ఈ ఆస్పత్రికి వైద్యసేవల కోసం వస్తుంటారు. నిత్యం 150 పడకలు నిండి ఉండగా, 600పైగా ఓపీ సంఖ్య ఇక్కడ నమోదవుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఈ ఆస్పత్రికి ఉండడంతో పగలు, రాత్రి కూడా రోగులు, సహాయకులతో రద్దీగానే ఉంటుంది. అటువంటి ఆస్పత్రిలో వైద్యవర్గాలకు రక్షణ కల్పించకపోగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుచేయమంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నిత్యం రద్దీగా అత్యవసర విభాగం
జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వివిధ కారణాలతో వైద్యంకోసం వస్తుంటారు. ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, కొట్లాటల్లో గాయపడిన వారు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో వారితోపాటు సహాయకులు, బంధువులు మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని సిబ్బంది వాపోతున్నారు. రాత్రి సమయంలో అత్యవసర విభాగంలో ఉండే ఒక వైద్యుడితోపాటు సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉంటారు. అయితే వారికి నచ్చినట్లుగా వైద్యం చేయకపోయినా, లోపలకు అనుమతించకపోయినా దాడులకు దిగే పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతోపాటు పదుల సంఖ్యలో లోపలకు రావడం వలన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందరూ లోపలకు రావద్దంటున్న సిబ్బందిపై మందుబాబులు బీభత్సం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మహిళా వైద్యులు విధుల్లో ఉండాలంటనే భయంతో వణికిపోతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఏరులై పారుతున్న మద్యానికి బానిసలైన మందుబాబులు ఆస్పత్రికి వస్తే చాలు వైద్యవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
అత్యవసర విభాగమా అమ్మ బాబోయ్..
రాత్రి వేళల్లో మందుబాబుల వీరంగంతో హడల్
నైట్ డ్యూటీ అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి
పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్