
బ్లడ్‌బ్యాంక్ సౌకర్యం అందని ద్రాక్షేనా!?
నూజివీడు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌బ్యాంకు సదుపాయం అందని ద్రాక్షగా తయారైంది. శస్త్రచికిత్సలు, కాన్పులు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స చేసే సమయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసి విజయవాడకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయమనే డిమాండ్ గత రెండు దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
గుడివాడ, విజయవాడ నుంచి తెస్తున్నారు
నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, విస్సన్ననపేట, రెడ్డిగూడెం, మైలవరం, బాపులపాడు తదితర మండలాల నుంచి నూజివీడు ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 450 మంది వరకు రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ప్రతినెలా కాన్పులతో పాటు జనరల్ సర్జన్స్, ఆర్ధోతో పాటు ఇతర శస్త్రచికిత్సలు 320 వరకు జరుగుతాయి. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు ఎక్కించేందుకు రక్తం అందుబాటులో లేకపోవడంతో విజయవాడకు రిఫర్ చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే విజయవాడ, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తెప్పించి ఆ తరువాత ఆపరేషన్‌లు చేస్తున్నారు.
బ్లడ్‌బ్యాంకు వస్తే ఎన్నో లాభాలు
ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో లాభాలు చేకూరతాయి. కాన్పులకు సంబంధించిన శస్త్రచికిత్సలు గాని, జనరల్ శస్త్రచికిత్సలు గాని, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి సంబంధించిన చికిత్సను గాని ఇక్కడ నిర్వహించడానికి వీలుంటుంది. అంతేగాకుండా రక్తదాతల నుంచి రక్తాని ఇక్కడే స్వీకరించవచ్చు. అలాగే పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, కళాశాలల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అవసరమైన రక్తాన్ని ఇవ్వడానికి సైతం వీలుంటుంది. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు సైతం ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్‌బ్యాంక్‌ను మాత్రం ఏర్పాటు చేయడం లేదు.
నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్‌కే పరిమితం
రక్తం కావాలంటే విజయవాడ, గుడివాడలకు పరిగెత్తాల్సిందే
ప్రతిపాదనలు పంపాం
బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అధికారులు తనిఖీలు పూర్తి చేసిన అనంతరం బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ మాత్రమే ఉంది. రక్తం కావాలంటే గుడివాడ ఏరియా ఆసుపత్రి బ్లడ్‌బ్యాంకు నుంచి, విజయవాడలోని రెడ్‌క్రాస్‌కు చెందిన బ్లడ్‌బ్యాంకు నుంచి తీసుకొస్తున్నాం.
– డా.ఆర్ నరేంద్రసింగ్, ఆసుపత్రి సూపరింటెండెంట్

బ్లడ్‌బ్యాంక్ సౌకర్యం అందని ద్రాక్షేనా!?