
ఆదివాసీ గిరిజనులపై అమానుషం
భీమవరం: ఆదివాసీ గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారని నక్సలైట్లు పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వంకతో నక్సలైట్లను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపడం దుర్మార్గమన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇచ్చిన అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ముప్పాళ్ళ చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ సీపీఐ జిల్లా మహాసభలు ఆగస్టు 6, 7 తేదీల్లో ఉండిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముందుగా పహల్గాం ఘటనలో మృతులకు, ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులు జక్కంశెట్టి నాగేశ్వరరావు, మొల్లేటి చినవెంకటరెడ్డి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు.
రొయ్యల పట్టుబడికి వెళ్లనివ్వడం లేదు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తన రొయ్యల చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారితో ఏర్పడిన ఘర్షణలో స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యాడు పెదపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఘంటసాల సుబ్బారావు. దీంతో అతడిని ఏలూరులోని ఆయుష్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులమనే నెపంతోనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో చెరువుల్లో చేపలు, రొయ్యలు పట్టనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుబ్బారావుకు చెందిన చెరువుల్లో చేపలను పట్టనీయలేదు. దీనిపై అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరలా రొయ్యలను పట్టుకోనివ్వకుండా అడ్డుకోవడంతో సుబ్బారావు ఆందోళనకు లోనై ఆస్పత్రిపాలయ్యాడని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం విరమించుకోవాలి
భీమవరం: రేషన్‌షాపుల నుంచి మొబైల్ డిస్సెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేయకుండా మరింత మెరుగుపర్చి ఇంటింటికీ రేషన్ సరుకులు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీ గోపాలన్ డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించడంతోపాటు వాహనాల వద్ద రేషన్‌న్ తీసుకోలేకపోయనవారికి రేషన్‌న్ డిపో వద్ద సరుకులు తీసుకునేట్లుగా ఏర్పాటు చేయాలన్నారు.