ఏలూరు (టూటౌన్): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించడంపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కండ్రిగగూడెంలోని సంఘ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. దళితుల్లో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ రాష్ట్ర నాయకులు కాశీ కృష్ణ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మురళి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేంద్రబాబు, ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షుడు గద్దల ప్రసాద్, ఏలూరు వర్కింగ్ అధ్యక్షుడు గూడూరు రాజేష్ బాబు తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
దళిత సేన హర్షం
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకు మేలు జరిగేలా సమాన అవకాశాలు ఏర్పడతాయని ఆకాంక్షించారు.