‘భద్రకాళి’కి జలకళ | - | Sakshi
Sakshi News home page

‘భద్రకాళి’కి జలకళ

Oct 15 2026 7:54 AM | Updated on Oct 15 2026 7:54 AM

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగర ప్రజల తాగునీటి వరప్రదాయిని భద్రకాళి చెరువులోకి దశాబ్ద కాలం తర్వాత గోదావరి జలాలు చేరుతున్నాయి. ధర్మసాగర్‌ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌, ఆటోనగర్‌ రా వాటర్‌ పంపుహౌస్‌ మీదుగా సెంట్రల్‌ జైలు సమీపం నుంచి భద్రకాళి చెరువులోకి గ్రావిటీ ద్వారా తరలిస్తున్నారు. ఐదు రోజులుగా ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు నీటిని మళ్లిస్తున్నారు. రాత్రి వేళల్లో ఽగ్రావిటీ నీటి మొత్తాన్ని ఫిల్టర్‌ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. రెండేళ్లుగా నీరు లేక ఏడారిని తలపించిన భద్రకాళి చెరువు ఇక జలకళ సంతరించుకోనుంది. చెరువు పూర్తిస్తాయి సామర్థ్యం 150 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లు (ఎంసీఎఫ్‌టీలు) కాగా.. ప్రస్తుతం 30 నుంచి 35 ఎంసీఎఫ్‌టీల నీరు చేరింది. దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌లో నీటిని శుద్ధి చేసి వరంగల్‌ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ధర్మసాగర్‌ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్‌కు వచ్చే మిగులు(ఎక్సెస్‌) నీటిని చెరువులోకి పంపిస్తున్నారు. దేవాదుల ఇన్‌టేక్‌ వెల్‌ నుంచి మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్‌ చెరువు, చలివాగు, పులుకుర్తి నుంచి ధర్మసాగర్‌ చెరువులోకి గోదావరి జలాలతో సామర్థ్యం మేరకు నింపేందుకు ఇరిగేషన్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాలతో బల్దియా ఇంజనీర్లు నీటి మళ్లింపు చర్యలకు ప్రత్యే చొరవ తీసుకుంటున్నారు.

పర్యాటకులు, భక్తులకు కనువిందు..

ఒకవైపు గుట్టలు, చుట్టూ పచ్చందాలు, పక్కనే తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరొందిన భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డు–హుస్సేన్‌సాగర్‌ తరహాలో భద్రకాళి బండ్‌ రూపుదిద్దుకుంది. చెరువు జలకళ సంతరించుకోవడంతో భక్తులు, పర్యాటకుల సందడి నెలకొంటుంది. అంతేకాకుండా ప్రతి దసరాకు భద్రకాళి ఆలయం వద్ద తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ఆ వేడుక కల తప్పింది. ప్రస్తుతం చెరువులో చేరిన నీరు భక్తులను కనువిందు చేయనుంది.

దశాబ్దం కాలం తర్వాత చెరువులోకి గోదావరి నీరు

ధర్మసాగర్‌ నుంచి

గ్రావిటీ ద్వారా విడుదల

భవిష్యత్‌ అవసరాల కోసం

ఇరిగేషన్‌ శాఖ ముందస్తు చర్యలు

25 ఏళ్లుగా చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు

గతంలో వరంగల్‌, అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతాల ప్రజల తాగునీటిని భద్రకాళి చెరువు తీర్చేది. కాకతీయ కాల్వ ద్వారా వచ్చే నీళ్లను నింపేవారు. దశాబ్ద కాలంపై భద్రకాళి చెరువును నింపడం లేదు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పలు కాలనీలు జలమయం కాకుండా బొంది వాగుకు సమీపంలో ఉన్న ప్వలింగ్‌ షట్టర్లను తెరిచి చెరువులోకి మళ్లించేవారు. హనుమకొండ పద్మాక్ష్మి గుట్ట వైపు మురుగునీరు కలుస్తోంది. అంతేకాకుండా 25 ఏళ్లుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. చెరువులో గుర్రపు డెక్క, పచ్చగడ్డి ఏపుగా పెరిగింది. హెచ్‌ఎండీఏ వద్ద ఉన్న ప్రోటింగ్‌ గ్రాస్‌ కలెక్టింగ్‌ మిషన్‌ వరంగల్‌కు ఐదేళ్ల క్రితం తెప్పించారు. 33 రోజుల పాటు సుమారు 300 క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలను తొలగించారు. గతంలో మిషన్‌ భగీరథ ద్వారా కొన్ని నెలలు పూడికతీత పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. రెండేళ్ల కిందట చెరువులో నీటి మొత్తాన్ని ఖాళీ చేయించారు. రూ.11 కోట్లతో పూడికతీత పనులు మొదలు పెట్టారు. 17 క్యూబిక్‌ మీటర్ల పూడిక తీయాలని ప్రతిపాదనలు చేసి 6 నెల క్రితం వరకు 10 క్యూబిక్‌ మీటర్ల పూడిక మాత్రమే తీసి తరలించారు. పూడికతీత పనులు పూర్తి కాలేదు.

వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా..

ఎల్‌నినో ప్రభావంతో నగరంలో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావులు ఎండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుచూపుతో ధర్మసాగర్‌ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌ గ్రావిటీ నీరు చెరువులోకి చేరుతోంది. చెరువును సామర్థ్యం మేరకు నింపుతారా లేదా అనే స్పష్టత లేదు. చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే భద్రకాళి చెరువు నీటిని దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్‌కు పంపింగ్‌ చేసి, నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు సమాలోచన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement