హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుఃషష్టి ఉపచార పూజలు, చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం క్రూష్మాండిని క్రమంలో పూజలు జరిపి ఉత్సవమూర్తిని సూర్యప్రభవాహనంపై, సాయంత్రం గిరిజాక్రమంలో పూజలు జరిపి హంసవాహనంపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఆలయంలో తయారుచేస్తున్న దారు రథాన్ని పరిశీలించారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయానికి రెండేళ్లకాలానికి 11 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయగా 2014 వరకు కొనసాగింది. అనంతరం 11 ఏళ్లుగా పాలకమండలి లేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ 2025, జూన్11న ఏడాదికాలానికి వంశపారంపర్యేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. తాజాగా పూర్తిస్థాయి నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. మండలిలో కమటం వేణుగోపాల్, కల్లూరి పవన్‌కుమార్, కటకం రాములు, కరేంగుల సురేష్‌బాబు, గదే శ్రవణ్‌కుమార్‌రెడ్డి, చిదర అంజని, మాడిశెట్టి సతీశ్, పేరాల శ్రీనివాస్‌రావు, రమేశ్‌చంద్ బ్యాంగ్, చింతలపాని వాసవీరెడ్డి, మోత్కూరి మయూరి సభ్యులుగా ఉన్నారు. ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేసిన తేదీనుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
వరంగల్‌కు డీడీ గోవిందరాజు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో పదోన్నతులు, పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు డిప్యూటీ డైరెక్టర్లుగా తాత్కాలికంగా పదోన్నతి కల్పించింది. అందులో బి.గోవిందరాజును వరంగల్‌లోని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ జీఓ ఆర్టీ నంబర్ 185 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్ ఇన్చార్జ్ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న జయరాజుపై ఆగస్టు 27న ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ దాడులు జరిపిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్‌కు గురికాగా, వనపర్తి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న బి.గోవిందరాజును ఇన్చార్జ్ డీడీగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు – 1996లోని రూల్ 10(ఏ) ప్రకారం కల్పించిన పదోన్నతుల్లో భాగంగా పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.
కేయూ క్యాంపస్: అతిథి అధ్యాపకుల ఉద్యోగ భద్రత, వేతనాల మెరుగుదల, న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు, టీసీఈ – జేఏసీ చైర్మన్ డాక్టర్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అతిథి అధ్యాపకుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యారంగంలో అతిథి అధ్యాపకుల సేవలు కీలకమని కొనియాడారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నవీన్, గెస్ట్ ఫ్యాకల్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ నవీన్, డాక్టర్ పెండ్యాల సురేశ్, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


