హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవీశరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారిని శ్రీగాయత్రీ మాతగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం చంద్రఘంటా క్రమంలో దుర్గార్చన చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషామర్ధిని క్రమంలో దుర్గార్చన జరిపి గజవాహనంపై ఊరేగించారు. సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దేవాలయాన్ని సందర్శించి మాడవీధుల నిర్మాణ పురోగతిని, నూతనంగా తయారు చేస్తున్న దారురథాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట కుడా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు.
హన్మకొండ అర్బన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు లేకుండా చూడడమే లక్ష్యంగా ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు తమ పరిధి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత బూత్ స్థాయి అధికారులను లేదా జిల్లా ఎన్నికల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు, రికార్డులను పరిశీలించా రు. చికిత్స రుసుముల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని, వైద్యుల పేర్లు, అర్హతలు, విధుల వివరాలతో కూడిన జాబితా ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ (థానా) కమిటీ సభ్యులు అంగీకరించారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో పథకం అమలుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో తానా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేశ్, సభ్యులు డాక్టర్ విజయ్చందర్రెడ్డి, డాక్టర్ విజయ్, డాక్టర్ బి. మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


