విద్యారణ్యపురి/కాజీపేట: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడిఝెట్ వరకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున అనుమతినిస్తూ వస్తోంది. మొదటి దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు గత నెలలో అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండో దశలో హనుమకొండ జిల్లాలో మరో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అనుమతిస్తూ ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది.
నిధులు మంజూరు
పరకాల నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం జెడ్పీహెచ్ఎస్ పెద్దాపూర్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం రూ.9 కోట్ల 95 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గం ధర్మసాగర్ మండలం నారాయణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్‌పర్తి మండలం హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో నాలుగు పబ్లిక్‌స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే, మహబూబాబాద్ జిల్లాలోనూ మరో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర జెడ్పీహెచ్ఎస్ చిట్యాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిస్తూ రూ.11.40 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదరు ప్రభుత్వ హైస్కూల్‌కు, నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసింది. దీంతో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి.
మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య
ప్రస్తుతం ఉన్న హైస్కూళ్ల భవనాల్లోనే తరగతి గదులను యథావిధిగా ఉంచి అదనంగా అవసరమైన మేరకు తరగతి గదులను, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా మైదానం, మోడల్ కిచెన్, లైబ్రరీ, డైనింగ్‌హాల్, తదితర మెరుగైన విద్యను అందించేలా అవసరమైన వసతులు కల్పించనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు అవసరమైన స్థలం ఉన్న హైస్కూళ్లను ఎంపిక చేశారు.
హనుమకొండ జిల్లాకు మరో రెండు స్కూళ్లు..
మహబూబాబాద్‌కు మరొకటి మంజూరు


