యాసంగిపై ఎల్‌నినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యాసంగిపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

2025 రబీలో 2,61,925 ఎకరాల సాగు.. ఈసారి 2,11,562 ఎకరాలే..

సాక్షి, వరంగల్‌: ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు.. వర్షపాతంలో లోటు.. రానున్న నెలల్లో సాగునీటి లభ్యతపై సందేహాలు.. కరెంట్‌ వినియోగం.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని జిల్లా వ్యవసాయ శాఖ యాసంగి సీజన్‌ (రబీ) సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 2,61,925 ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది యాసంగికి 2,11,562 ఎకరాల్లో సాగు చేయొచ్చని అంచనా వేశారు. ఈసారి మొత్తం సాగు విస్తీర్ణాన్ని సుమారు 50,363 ఎకరాల మేర తగ్గించి అధికారులు నివేదిక రూపొందించారు. ముఖ్యంగా నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి సాగును గణనీయంగా తగ్గిస్తూ.. మొక్కజొన్నతోపాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగుకు వ్యవసాయ శాఖ ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం 19 శాతానికి పైగా తగ్గించి ప్రణాళిక రూపొందిచడం ఆందోళన కలగించే అంశంగా చెప్పవచ్చు.

వరికి కోత.. మొక్కజొన్నకు ప్రాధాన్యం

● గతేడాది యాసంగిలో 1,16,541 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈసారి కేవలం 41,343 ఎకరాల్లోనే సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే దాదాపు 75,198 ఎకరాలు తగ్గనుంది. గతేడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం సుమారు 64.5 శాతం తగ్గనుంది.

● మొక్కజొన్న సాగును 1,43,764 ఎకరాల నుంచి 1,57,510 ఎకరాలకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. సుమారు 13,746 ఎకరాల మేర పెరగనుంది. వరి సాగు తగ్గుతుండగా.. మొక్కజొన్నకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఈ యాసంగి ప్రణాళికలో ప్రధాన మార్పుగా కనబడుతోంది. అయితే మొక్కజొన్నకు కూడా కీలక దశల్లో తగినంత తేమ, నీరు అవసరమే. అందువల్ల పంట మార్పుతోపాటు నీటి వనరులకు అనుగుణంగా రైతులను సాగు చేయించడంపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

34 శాతం లోటు వర్షపాతమే..

ఈ ఏడాది వర్షపాత పరిస్థితులు.. 34 శాతం లోటు వర్షపాతం సాగు అంచనాలో కీలకంగా మారాయి. జూన్‌ ఒకటి నుంచి అక్టోబర్‌ 12 వరకు నర్సంపేట మండలంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 57 శాతం లోటు నమోదైంది. నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లో 49 శాతం చొప్పున, నెక్కొండలో 42 శాతం, ఖిలా వరంగల్‌లో 41 శాతం లోటు కనిపిస్తోంది. దుగ్గొండి, గీసుగొండ మండలాల్లో 35 శాతం, సంగెంలో 34 శాతం, పర్వతగిరిలో 32 శాతం, వరంగల్‌ మండలంలో 30 శాతం, చెన్నారావుపేటలో 28 శాతం లోటు ఉంది. రాయపర్తిలో 14 శాతం లోటు నమోదవగా, వర్ధన్నపేటలో సాధారణం కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఎల్‌నినోతో పూర్తిగా వర్షాలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేమని కొన్నిసార్లు ఇతర వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

వరి సాగు 41,343 ఎకరాలకు పరిమితం

పెరగనున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం

మక్కల దారిలోనే కూరగాయల సాగు..

పంటల వారీగా లక్ష్యాల నిర్ధారణతో యాసంగి సాగుకు వ్యవసాయశాఖ కార్యాచరణ

సాగు విస్తీర్ణం తగ్గుతుంది..

గతేడాది యాసంగితో పోల్చుకుంటే ఈసారి వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు, బోర్లు, బావుల నీటి మట్టాలు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలపైనే సాగు ఆధారపడి ఉంటుంది. అందుకే రైతులకు పంటల వారీగా నీటి అవసరాలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. వర్షపాతం, నీటి లభ్యతను బట్టి క్షేత్రస్థాయిలో మార్పులు చోటుచేసుకోవచ్చు.

– విజయభాస్కర్‌, డీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement